- కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సమగ్ర విచారణ జరపాలి….
- జ్ఞానేశ్వర్ కుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే నాయిని..
- హనుమకొండ డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం
- పాల్గొన్న ఎమ్మెల్యేలు ,ఎంపీ..
హనుమకొండ జిల్లా, న్యూస్ పేజ్ :
దేశ ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు, తొలగింపులపై సమగ్ర విచారణ జరిపించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏఐసీసీ ఆదేశాల మేరకు సోమవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
హనుమకొండ హార్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు , వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు , పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు , డీసీసీ అధ్యక్షుడు శ్రీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి,టీపీసీసీ ప్రధానకార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్,దుద్దిళ్ల శ్రీను బాబు,EV శ్రీనివాస్ రావు,టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ తదితరులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేసి, జ్ఞానేశ్వర్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే ప్రజల అత్యంత కీలకమైన ఆయుధమని, ఆ ఓటు హక్కును హరించే ఏ ప్రయత్నాన్నైనా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై తక్షణమే స్వతంత్ర, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలు మరింత తీవ్రమైన చర్చకు దారితీశాయని ఆయన పేర్కొన్నారు. SIR ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘంలోని ఇతర కమిషనర్లు కూడా కొన్ని నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న మీడియా కథనాలను కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.జ్ఞానేశ్వర్ కుమార్ పై చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న ఓటు చోరీ అంశాన్ని ప్రతి ప్రజాస్వామ్యవాది తీవ్రంగా పరిగణించాలని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలంటే ఓటర్ల జాబితా తయారీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశ పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల కూడా ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.ప్రజల ఓటు హక్కును ఎవరూ కాలరాయలేరు. ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు జరిగాయన్న ఆరోపణలు నిజమైతే అవి ప్రజాస్వామ్యంపై దాడి వంటివే. అందుకే విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలి అని ఎమ్మెల్యే నాయిని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్లకు పైగా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. రైల్వేలు, LIC, BSNL వంటి దేశ ప్రజలకు ఉపయోగపడే సంస్థలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర ఉందని పేర్కొన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తోందని ఆయన ఆరోపించారు. BSNL వంటి సంస్థల సామర్థ్యాన్ని దెబ్బతీసి ప్రైవేట్ టెలికాం సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైల్వేలు, LIC తదితర రంగాల విషయంలోనూ ప్రైవేటీకరణపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు.
బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ అప్పుల భారం మోపిందని కూడా ఆయన ఆరోపించారు. యువత భవిష్యత్తుతో ముడిపడిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలపై కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వరంగల్ అభివృద్ధి విషయంలో కూడా బీజేపీ నేతలు కేవలం ప్రెస్‌మీట్లకు పరిమితమవుతున్నారని నాయిని విమర్శించారు. మామునూరు విమానాశ్రయం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎవరి పాత్ర ఎంత ఉందో ప్రజలకు తెలుసని అన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా తమవేనంటూ చెప్పుకోవడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, అభివృద్ధి పనుల్లో ఎవరు కృషి చేశారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో అధికారానికి మూలం ప్రజలేనని, ప్రజల ఓటు హక్కును ఎవరూ తక్కువ చేసి చూడలేరని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా ఎన్నికల సంఘం ప్రతి ఆరోపణకు పారదర్శకంగా సమాధానం చెప్పాలని కోరారు.
అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన ఓటర్ల జాబితాలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ మార్పులు, ఓటర్ల తొలగింపులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు లేఖను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, డీసీసీ నాయకులు, జిల్లా, నగర కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, NSUI నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
