- వైద్యార్హతలు లేకుండా తప్పుడు చికిత్స
- ప్రాణాపాయ స్థితికి చేరిన లా విద్యార్థి
హైదరాబాద్ ప్రతినిధి , న్యూస్ పేజ్ :
ప్రముఖ డైట్ నిర్వాహకుడు వీరమాచినేని రామకృష్ణ (VRK), డాక్టర్ కోటేశ్వరరావులపై రాయదుర్గం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. యూట్యూబ్, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మి వీఆర్‌కే హెల్త్‌కేర్ సెంటర్‌ను ఆశ్రయించిన ఓ లా విద్యార్థి ప్రాణాల మీదికి తేవడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
నిర్మల్ జిల్లాకు చెందిన కల్లెడ సాయికృష్ణ గత కొన్ని ఏళ్లుగా టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతూ ఇన్సులిన్ వాడుతున్నాడు. వీరమాచినేని డైట్ ద్వారా మధుమేహం పూర్తిగా నయమవుతుందనే ప్రకటనలు చూసి, ₹26,000 ఫీజు చెల్లించి రాయదుర్గంలోని వారి కేంద్రాన్ని సంప్రదించాడు. అక్కడ వీరమాచినేని సలహా మేరకు ఇన్సులిన్ వాడటం పూర్తిగా ఆపేసి, కేవలం వీఆర్‌కే డైట్, సప్లిమెంట్లు మాత్రమే తీసుకున్నాడు. అయితే, డైట్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే అతను తీవ్ర డీహైడ్రేషన్, 'డయాబెటిక్ కీటోయాసిడోసిస్' బారిన పడి స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.
తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులపై మోసం చేయడం (BNS 318(4)), ప్రాణాలకు ముప్పు కలిగించడం (BNS 125(a)) వంటి సెక్షన్లతో పాటు, అర్హత లేకుండా ఆధునిక వైద్యం ప్రాక్టీస్ చేయడంపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చట్టం కింద కేసులు నమోదు చేశారు. అలాగే డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుడు సోషల్ మీడియాలో ఇలాంటి వైద్య సలహాలు ఇవ్వకుండా తాత్కాలిక నిషేధం విధించారు.
